అనగనగా ఒక ఊరిలో 🔪 - కథ రాసినవారు :యశ్వాంత్ గౌడ్

అనగనగా ఒక ఊరిలో 🔪 : అది ఉదయం 3 గంటలు , చుట్టూ చీకటి, ఊరంతా ప్రశాంతంగా నిద్రపోతున్న సమయం, ఊరి చివర మూసి ఉన్న సుబ్బయ్య హోటల్ ముందు కాలిగా ఉన్న బెంచ్ పై కూర్చుని దీర్గంగా ఆలోచిస్తూ ఉన్నాడు ఒక అజ్ఞాత వ్యక్తి , అటువైపుగా సైకిల్ పై వెళ్తూ ఎవరో ఉన్నారు అన్నది గమనించి రోడ్డు పై సైకిల్ ఆపి స్టాండ్ వేసి నడుచుకుంటూ సుబ్బయ్య హోటల్ వైపు లాంతరు పట్టుకుని "ఎవరు, ఎవరయ్యా అది" అని లాంతరు అక్కడ కుర్చున్న వ్యక్తి వైపు తిప్పి ఆశ్చర్యంతో "సుందరం .... ఈడున్నవా నిన్ను ఏతుక్కుంటూ వచ్చిన , ఇంట్లోళ్ళు ఆగమైతుండ్రు జల్దీ పోదాం పా" అని శేఖరం అనగానే... తన దగ్గర ఉన్న కత్తి తీసి శేఖరంని కసా కసా... పొడిచేసి శేఖరం చనిపోయాడని ధృవీకరించికుని పక్కనే గోలెం లో ఉన్న నీళ్లతో కత్తిని కడిగి ఇంటికి బయలుదేరుతాడు సుందరం.

మరిన్ని కథలు కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.


అనగనగా ఒక ఊరిలో


అనగనగా ఒక ఊరిలో 🔪


తన ఇంటి గుమ్మంలో సుందరం కోసం ఎదురు చూస్తూ చంటి బిడ్డని సంకన ఎత్తుకుని నిల్చుంటుంది సుందరం భార్య సావిత్రి , 3.21 గంటలకి ఇంటి ఆవరణలోకి వొస్తున్న సుందరంని చూసి సంతోషం మరియు సహనం కోల్పోయిన కలెగల్పిన స్వరంతో "ఏమయ్యా నిన్న సందేళ పోయినవ్ ఇంతదాగా ఇల్లు యాది రాలేదా, నువ్వు శీకటి పడ్డా రాకపోయేసరికి పక్కింటి శేఖరంని నీ కాడికి పంపిన రాలేదా?"  అంటుంది సావిత్రి,  "అబ్బా అర్జెంటు పని మీద టౌన్ కి పోయి వొస్తున్ననే, పోయి పోయి వాడినేందుకు పంపినవే అసలే పెళ్ళాం లేని సంసారం     పొరగాండ్లు భయపడరు "అంటాడు  సుందరం,    " నేను సెప్పిన అయ్యా.... కానీ శేఖరం నా బాధ సూడలేక నీకోసం(నిన్ను ఏతకడం కోసం ) ఓ పారి ఊరు చివరిదాకా పోయి వొస్తా అన్నడు " అంటుంది  సావిత్రి, " అవునా మరి నాకు కన్పించలేదే, సర్లే ఆడే వొస్తడు కానీ ఆకలిగా ఉందే బుక్కడంత బువ్వ పెట్టు తింటా" అని అంటాడు, "అయ్యో నా మతిమండ, నువ్వు వొచినవన్న సంతోషంల అడుగుడే మర్శిన" అంటు ఇంట్లోకి తీసుకెళ్తుంది భర్తని సావిత్రి,పెరట్లకు పోయి కాళ్ళు చేతులు కడుక్కుని కుసుని  కాస్త అన్నం తిన్నట్టు చేసి పోయి బిస్తరేక్కుతాడు  సుందరం,  ఎలాగూ శేఖరం ఇంటికి తిరిగి వొస్తాడు అనే నమ్మకం తో పోయి పడుకుంటుంది సావిత్రి.

బిస్తరెక్కిన సుందరం కళ్ళు ముస్కోగానే  తన భార్య చంటి బిడ్డని ఎత్తుకుని గోడపై నుండి పక్కింటి శేఖరం  తో మాట్లాడటం, నవ్వడం,శేఖరం నవ్వుతూ తన భార్య తలపై చెయ్యి వేయడం,పక్క ఊర్లో ఉన్న తన మిత్రుడు సుందరం ఊరి సంతకి వొచ్చి, "నీ భార్య అదుపు తపినట్టుంది  కోసింత సూస్కో" అనడం, బయట శేఖరం తో చాలా చనువుగా ఉంటూ ఇంట్లోకి వొచ్చి మాములుగా ఉండటం ఇలా ప్రతి ఒక్కటి సుందరం కళ్ళ ముందు అంజనం వేసినట్టు కనపడుతూ, తనకి తాను కలవరపడుతూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు.....

తెల్లవారుజాము సుమారు 5.45 గంటలు అప్పటికే   నిద్రలేచి వాకిలిసానుపు చేసి, మూసి ఉన్న శేఖరం ఇంటి తలుపువైపు చూసి పొద్దుపోయి వొచ్చి పడుకున్నాడేమో అని అనుకుని ముగ్గు వేసి ఇంట్లోకి వెళ్లి, ముగ్గు డబ్బా గూటిలో పెట్టి, చేతులు కడుక్కుని చాటలో కోసిన్ని బియ్యం తీస్కుని చెరుగుతూ ఉంటుంది, తను చెరిగే బియ్యం శబ్దం కి మెలుకువ వొచ్చిన సుందరం ఒక్క ఆవలింత తీసెలోపె ఊళ్ళో ఉన్న రంగడు ఉరుక్కుంటూ వొచ్చి మోసపొస్తూ "సావిత్రక్కా....... శేఖరంని ఎవరో సంపేశిన్రు ఇప్పుడే శవం ని తీసుకొచ్చిండ్రు" అని అంటాడు, రంగడు చెప్పిన మాటలు విని సావిత్రి తన చేతిలో ఉన్న చాటను ఒక్కసారిగా విసిరేసి "శేఖరం..... "అని అరుస్తూ పక్కింటికి పరుగు తీస్తుంది, అప్పుడే లేచిన సుందరం తన భార్య పరిగెత్తుతూ వెళ్లడం జీర్ణించుకోలేక "వాడిని సంపినా , దీనికి ఇంకా  బుద్ధి రాలేదు "అని కత్తి బొడ్లో పెట్టుకుని సావిత్రి వెనకాల వెళతాడు, శేఖరం చుట్టూ గుమ్మి కూడిన జనం, వాళ్ళ మధ్యలోనుండి శేఖరం "నన్ను వొదిలి పోయినవా....." అని సావిత్రి అరుపులు విని తన కోపం ఆపుకోలేక తన ఎడమ చేతితో గుమ్మికూడిన జనాన్ని పక్కకు జరుపుతూ కుడిచేతితో బొడ్లో ఉన్న కత్తిని తీస్తూ ముందుకు కదిలి శేఖరం శవం పై పడి ఏడుస్తున్న సావిత్రి దగ్గరదాకా పోయి ఇంక ఈ కధకి అంతం పలకాలి అని అనుకుంటూ కత్తి  పూర్తిగా తీసేలోగ "అన్నా.....నన్ను ఒంటరిని సేసి పోయినా అన్నా.... తోడపుట్టిన అన్న లేని లోటుని తీర్చి, నన్ను నా పిల్లల్నీ, నా భర్తని అనుక్షణం కనిపెట్టుకుంటూ కంటికి రెప్పలా సూస్కుంటివి ఇప్పుడు మమ్ముల్ని ఎవలు సూస్కుంటారన్నా..." అని ఏడుస్తుంది, అది చుసిన జనం సోకసముద్రం లో మునిగిపోతారు, ఆ దృశ్యాన్ని చూసిన సుందరం ఒక్కసారిగా కూలిపోయి, చెప్పుడు మాటలు విని చేయరాని నేరం చేశాననే బాధతో ఒక్కసారిగా "శేఖరం....... అని ఏడుస్తూ అరుస్తాడు......


నీతి : కళ్ళతో విని, చెవులతో చూస్తే జరిగేవి అనర్ధాలే .......

మా వెబ్‌సైట్‌లో కథలు ప్రచురించడానికి మీకు ఆసక్తి ఉందా? వెంటనే మాకు మెయిల్ చేయండి : districtsinfo.com@gmail.com

కథ రాసినవారు :యశ్వాంత్ గౌడ్
ఫోను నంబరు: 9949818003
ఇ-మెయిల్ ఐడి: yashwanthgoud@gmail.com
Profile :https://tinyurl.com/y65cjb3t
Page : https://tinyurl.com/y4j4dtmq
Previous Post Next Post