డైటింగ్‌ అంటే?

డైటింగ్‌ అంటే?.…..అన్నం తినడం మానేయడమా?….ఘనాహారానికి దూరంగా ఉండడమా? బరువు తగ్గడమా? డైటింగ్‌కు అసలు అర్థం ఇవేమీ కాదు…అవును, ఖచ్చితంగా ఇవేమీ కాదు…సరైన సమయంలో తగిన మోతాదులో పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే డైటింగ్‌….ఈ విషయాన్ని అర్థం చేసుకోని వారు ముఖ్యంగా యువత అనారోగ్యం పాలవుతున్నారు.

ఈ రోజుల్లో ‘డైటింగ్‌’ అనేది సాధారణంగా వినిపిస్తున్న పదం. ఎవరిని అడిగినా డైటింగ్‌ చేస్తున్నామని చెప్పేవారే. ఇంతకీ ఏం చేస్తున్నారు? అంటే ఆహారం తీసుకోవడం మానేసి అనారోగ్యం కొనితెచ్చుకుంటున్నారు. అనుకున్నది సాధించలేకపోగా ఎదురు వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డైటింగ్‌ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే బరువు తగ్గాలంటే డైటింగ్‌ పాటించాల్సిన విధానం….అందుకు అనుసరించాల్సిన పద్దతులు గురించి ముందుగా తెలుసుకోవాలి.


డైటింగ్‌ అంటే?

డైటింగ్‌ అంటే?


1) అల్పాహారం మానరాదు : ఉదయం సమయంలో తీసుకునే అల్పాహారం లేదా టిఫిన్‌ను తీసుకోవడం అస్సలు మానేయకూడదు. డైటింగ్‌ చేసేవాళ్ళు పాటించాల్సిన ముఖ్యసూత్రం ఇది. రాత్రి భోజనం తర్వాత తెల్లారేవరకు మనం ఎలాంటి ఆహారం తీసుకోం. ఈ స్థితిలో నిద్ర నుంచి మేల్కొన్న శరీరం తిరిగి జీవప్రక్రియలను లేదా జీర్ణప్రక్రియను ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియలో కాలరీలు ఖర్చు అవుతాయి. అందువల్ల ఉదయం సమయంలో శరీరానికి తప్పనిసరిగా ఆహారాన్ని అందించాలి. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాదు మనిషి రోజంతా హుషారుగా పనిచేసేందుకు అవసరమైన ఉత్సాహాన్ని అందిస్తుంది. పోషకాలతో కూడిన అల్పాహారం బ్లడ్‌ షుగర్‌లో తేడాల వల్ల మనకు కలిగే చిరాకు, విసుగు తదితర భావనలను పోగొడుతుంది.

2) ఆహారం బాగా నమిలి తినాలి : తీసుకునే ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. ఇలాంటి ఆహారమే శరీరానికి శక్తిని అందించగలుగుతుంది. సరిగ్గా నమలని ఆహారం జీర్ణం కాక కడుపునొప్పికి కారణమవుతుంది.

3) వేపుళ్ళకు దూరంగా ఉండాలి :వేపుడు కూరలు, నూనెలో వేగిన ఇతరత్రా ఆహారాలకు దూరంగా ఉండాలి. వేగిన ఆహారంలో ఎక్కువ కాలరీలు ఉంటాయి, కొవ్వు అత్యధికంగా ఉంటుంది, విటమిన్లు అన్నీ ఆవిరి అయిపోతాయి. ఆవిరి మీద లేదా ఓవెన్‌లో ఉడికించిన ఆహారం ద్వారా విటమిన్లను కాపాడుకోవచ్చు. టివి చూస్తూ తినద్దు : టివి చూస్తూ లేదా పుస్తకం చదువుతూ ఆహారం తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల మనకు తెలీకుండానే ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటాం. మన బాడీ ఇక ఒద్దు మొర్రో అంటున్నా పట్టించుకోకుండా లాగించేస్తూనే ఉంటాం. అందువల్ల ఎక్కువ కాలరీలు శరీరంలో చేరిపోతాయి. డైటింగ్‌కు ముప్పు తెచ్చే అంశాల్లో ఇది ఒకటి అనే విషయాన్ని మర్చిపోకూడదు.

4) నీరు ఎక్కువ తీసుకోవాలి : మన శరీర వ్యవస్థ సజావుగా పనిచేయాలంటే తగినంత నీరు తీసుకోవడం అవసరం. రోజూ ఉదయాన్నే కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీరు తీసుకోవాలి. దీంతో చర్మం కూడా కాంతివంతమవుతుంది. ఆకలిని అరికట్టి తక్కువ ఆహారం తీసుకునేందుకు దోహదపడుతుంది. తెల్లని ఆహారానికి దూరం దూరం : తెలుపు రంగులో ఉండే ఆహారం అంటే ముఖ్యంగా బియ్యం, బియ్యంతో చేసే ఇతరత్రా వంటకాలకు దూరంగా ఉండాలి. వైట్‌ బ్రెడ్‌, కేకులు అస్సలు తీసుకోరాదు. ఇందులో ఉప్పు, చక్కెర ఎక్కువ మోతాదులో ఉంటాయి. దీనికి బదులు ఫైబర్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.

5) ఆహారాన్ని మనమే తయారుచేసుకోవాలి : తక్కువ కాలరీలతో ఆహారాన్ని అందిస్తామని పలు రెస్టారెంట్లు ఇప్పుడు ఆకర్షిస్తున్నాయి. కానీ ఇందులో కూడా ఉప్పు, చక్కెర వంటి పదార్థాలను ఎక్కువగానే ఉపయోగిస్తారు. అందువల్ల బయట ఆహారాన్ని బాగా తగ్గించాలి. వీలయితే పూర్తిగా మానేయడం ఉత్తమం. మనకు తగిన రీతిలో మనమే ఆహారాన్ని తయారు చేసుకుంటే ఆరోగ్యకరం. ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా ఆదా అవుతుంది.

6) ఎక్సర్‌సైజ్‌ చేయాలి : ఆరోగ్యకరమైన జీవనానికి తగినంత వ్యాయామం అవసరం. ఇది కాలరీలను కరిగించి జీర్ణప్రక్రియ సజావుగా సాగేందుకు దోహదపడుతుంది. రోజుకి 20 నిమిషాలు వ్యాయామం చేయడం అవసరం. ఇందుకోసం సైక్లింగ్‌ లేదా స్విమ్మింగ్‌, బ్రిస్క్‌ వాకింగ్‌ ఇలా ఏదైనా ఎంచుకోవచ్చు. నడక లేదా వేగంగా జాగింగ్‌ చేయడం ఆరోగ్యానికి మంచిది.

ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పోషకాహారంతో డైటింగ్‌ చేస్తే ఆరోగ్యమే కాదు అందం కూడా మీ సొంతమవుతుంది. నిదానంగా బరువు తగ్గి నలుగురిని ఆకట్టుకునే మెరుపుతీగలు అవుతారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post